Cm chandrababu: లవ్ ఆల్, సర్వ్ ఆల్’, ‘హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్’

Cm chandrababu: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఆధ్యాత్మిక మహోత్సవాలతో కళకళలాడింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు, అలాగే ప్రశాంతి నిలయం స్థాపనకు 75 ఏళ్లు పూర్తైన సందర్బంగా భారీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇద్దరూ ముందుగా సత్యసాయి సమాధిని దర్శించి నివాళులు అర్పించారు.

తరువాత జరిగిన సభలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు—డబ్బు, పదవి ఉన్నా దొరకని ఆత్మశాంతి పుట్టపర్తిలో లభిస్తుందని, అందుకే దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు ఇక్కడికి వస్తారని పేర్కొన్నారు. ప్రశాంతి నిలయాన్ని ఒక “ఎనర్జీ సెంటర్”గా అభివర్ణించారు.

బాబా బోధించిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి పంచసూత్రాలతో కోట్లాది మంది జీవితాలు మారిపోయాయని చెప్పారు. ‘లవ్ ఆల్, సర్వ్ ఆల్’, ‘హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్’ వంటి సిద్ధాంతాలతో ఆయన ప్రపంచానికి మార్గదర్శకుడయ్యారని గుర్తుచేశారు.

1960లో బాబా స్థాపించిన సేవా సంస్థలు నేటికి గొప్ప సామాజిక సేవలను అందిస్తున్నాయని సీఎం వివరించారు.

102 పాఠశాలల ద్వారా 60,000 మంది విద్యార్థులకు ఉచిత విద్య

ఆసుపత్రుల్లో రోజూ 3,000 మందికి ఉచిత వైద్యం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో రూ.550 కోట్లతో 1600 గ్రామాలకు తాగునీరు

చెన్నై నగరానికే రూ.250 కోట్ల తాగునీటి ప్రాజెక్ట్

అంతేకాక, ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో 2,000 కేంద్రాలు, 7.5 లక్షల సేవా సభ్యులు ఉన్న సత్యసాయి సంస్థలు భారత గర్వకారణమని అన్నారు.

ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందకరమని, ఇదే విధంగా అధికారికంగా ఆధ్యాత్మిక ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా అభినందనలు తెలిపారు. బాబా బోధించిన వసుధైక కుటుంబకం భావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *