Chandrababu Naidu: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో జరిగిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ దారుణ ఘటనతో రాష్ట్రం అంతటా ఆగ్రహం వ్యక్తమవుతుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా శాంతిభద్రతలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో హోంమంత్రి అనిత, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఘటనను తీవ్రంగా ఖండిస్తూ “ఇది అమానుషం, అమానవీయం. నిందితులు ఎవరికీ ఉపశమనం ఉండదు. కఠిన శిక్షలు తప్పవు” అని హెచ్చరించారు.
లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వం అండగా
ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు. ఆయన భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం అందజేయాలని ఆదేశించారు. అదేవిధంగా, లక్ష్మీనాయుడు పిల్లల విద్యా ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది. ఇద్దరు పిల్లలకు చెరో 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ కల్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
గాయపడిన వారికి సాయం
కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌లకు కూడా సీఎం పరిహారం ప్రకటించారు. పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు, అలాగే పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. భార్గవ్‌కు రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి చికిత్స ఖర్చులు చెల్లించాలని కూడా ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: తెలంగాణ పోలీసింగ్ దేశానికే ఆదర్శం.. ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా
వేగవంతమైన న్యాయం కోసం ప్రత్యేక కోర్టు
లక్ష్మీనాయుడు హత్య కేసును వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి అప్పగించి, విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
నిందితులకు కఠిన శిక్షలు తప్పవు
ఈ కేసులో నిందితులపై ఎలాంటి ఉపశమనం ఉండదని సీఎం స్పష్టం చేశారు. “న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదు. ప్రజల ప్రాణ భద్రతకు విఘాతం కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తాం” అని ఆయన తెలిపారు.