CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ టెక్నాలజీలకు కేంద్రంగా మార్చాలని సంకల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, క్వాంటమ్ కంప్యూటింగ్‌ను మనం అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన ‘క్వాంటమ్ వ్యాలీ’ జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆయన, అమరావతిలో క్వాంటమ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రయత్నంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న టీసీఎస్, ఐబీఎం, ఎల్&టీ సంస్థలకు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
క్వాంటమ్ పార్కు – సాంకేతిక విప్లవానికి నాంది:
ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరైన ఈ వర్క్‌షాప్‌లో చంద్రబాబు మాట్లాడుతూ, క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించబోతోందని అన్నారు. అమరావతిని అత్యాధునిక సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. జనవరి 1, 2026 నాటికి అమరావతి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. దీనికి అవసరమైన ఎకోసిస్టమ్, వినియోగ సందర్భాలు (యూజ్ కేస్‌లు) కూడా అభివృద్ధి చేయాలని సూచించారు.
గత అనుభవాలు, భవిష్యత్ ప్రణాళికలు:
తన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఐటీ పరిశ్రమ విస్తరిస్తున్న వాతావరణాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ఐటీ విస్తరణపై చర్చించిన విషయాన్ని ప్రస్తావించారు. పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) మోడల్‌లో హైటెక్ సిటీని నిర్మించాలని ఎల్&టీని తాను కోరినట్లు, ఆ తర్వాత ఆ సంస్థ బెంగళూరు, గురుగ్రామ్‌లలోనూ ఐటీ భవనాలు నిర్మించిందని తెలిపారు. భవిష్యత్తులో భారత్ అతిపెద్ద ఐటీ హబ్‌గా మారుతుందని తాను అప్పుడే చెప్పానని పునరుద్ఘాటించారు. ఉమ్మడి ఏపీలో ఇంజనీరింగ్ కళాశాలలు గణనీయంగా పెరిగేలా చూశానని చెప్పారు.
Also Read: Congress: గిగ్ కార్మికుల కోసం కొత్త చట్టం..
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అడ్వాంటేజ్‌లు:
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అనేక ప్రయోజనాలను సీఎం వివరించారు. శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ సౌకర్యం ఉండటం, ఏపీ గ్రీన్ ఎనర్జీలో బలంగా ఉండటం వంటివి రాష్ట్రానికి కలిసొచ్చే అంశాలని పేర్కొన్నారు. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం రాష్ట్రానికి మరింత అనుకూలమని తెలిపారు.
డిజిటల్ సేవలు, స్టార్టప్‌లకు ఆహ్వానం:
1990వ దశకంలో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్‌గా మార్చిందని ఉద్ఘాటించిన చంద్రబాబు, ఐటీపై ఆలోచన చేస్తే సరిపోదని, దానికి ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలకు వేదికగా మారిందని గుర్తు చేశారు. ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రభుత్వ సేవలు అన్నీ వాట్సాప్ చాట్‌బోట్ ద్వారానే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అమరావతికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని స్టార్టప్ కంపెనీలను ఆయన ఆహ్వానించారు.
టిసిఎస్, క్వాంటమ్ కంప్యూటింగ్:
టాప్ ఏఐ వినియోగంలో చైనా, యూఎస్, ఇండియా మాత్రమే ముందున్నాయని సీఎం వివరించారు. టీసీఎస్ మొదటి నుంచి తమతో కలిసి ప్రయాణిస్తోందని, ఇప్పుడు డేటాలింక్‌పై పనిచేస్తోందని వెల్లడించారు. 1989లో కుప్పం నుంచి పోటీచేస్తూ ఒక పబ్లిక్ మీటింగ్‌లో తాను ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజ్ తెస్తానని చెప్పినప్పుడు తన ప్రత్యర్థులు తప్పుపట్టారని గుర్తుచేసుకున్నారు. ఇది తన దూరదృష్టికి నిదర్శనమని పరోక్షంగా పేర్కొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీలోనూ ఇలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.