Cm chandrababu: తెలుగు దేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కడప మహానాడు సభలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ, కడప ఇకపై టీడీపీ అడ్డా అని నిరూపితమైందని స్పష్టం చేశారు. ప్రజల ఉత్సాహం, అధిక జనసమూహం కడప నగరాన్ని జనసముద్రంగా మార్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
“కడపలో మహానాడు పెడతారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మహానాడు కడపలో పెట్టడం గర్వకారణం” అని అన్నారు. దేవుని కడపలో మహానాడు ఘనంగా నిర్వహించడమే కాకుండా, ఇది ప్రజల మద్దతుతో సూపర్ హిట్ అయ్యిందని తెలిపారు.
“అహంకారంతో విర్రవీగిన వారిని ప్రజలు ఎన్నికల్లో అద్భుత తీర్పుతో తిప్పికొట్టారు” అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ కూటమి పదికి ఏడు స్థానాల్లో గెలిచిందని, ఇది టీడీపీ పునరుత్థానానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు.
అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో “పదికి పది స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగాలి” అని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కడప గడపలో పార్టీకి ప్రజలు ఇచ్చిన ఆదరణ, విశ్వాసం చూస్తుంటే రాష్ట్రంలో రాజకీయ దిశ పూర్తిగా మారిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన మహానాడు ద్వారా కడప రాజకీయంగా టీడీపీకి బలమైన కేంద్రంగా మారినట్లు స్పష్టమవుతోంది. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపిన మహానాడు, పార్టీ భవిష్యత్తు విజయాలకు బాటలు వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.