Cm chandrababu: గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 2019 నుండి 2024 మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో భారీ విధ్వంసం చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు.
“గత ప్రభుత్వం రూ. లక్షా ఇరవై వేల కోట్ల బిల్లులను చెల్లించకుండా బకాయిలుగా వదిలేసింది. ఇది రాష్ట్రాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది,” అని సీఎం అన్నారు. వైసీపీ పాలన రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి వేసిందని పేర్కొంటూ, “ఈ విధ్వంసం నుంచి బయటపడటానికి కనీసం పదేళ్లు అవసరమవుతుంది” అని చెప్పారు.
అయితే, కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర పునర్నిర్మాణానికి అన్ని రంగాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. “ఈ ఏడాది రాష్ట్రానికి దేశంలో అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఇది మంచి సంకేతం. మళ్లీ అభివృద్ధి పథంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లే దిశగా చర్యలు తీసుకుంటున్నాం,” అని పేర్కొన్నారు.
ప్రజల ఆశలను నెరవేర్చేలా పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, భవిష్యత్తు తరం కోసం బలమైన ఆర్థిక భవనం వేసే బాధ్యతను తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు.

