cm chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని సంకల్పించి, ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దిశగా, ప్రముఖ యోగా గురువు, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం కలిగిన బాబా రామ్‌దేవ్ సేవలను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
విజయవాడలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, బాబా రామ్‌దేవ్‌ను రాష్ట్ర పర్యాటక శాఖకు సలహాదారుగా వ్యవహరించమని కోరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,
“ఆధ్యాత్మికతకు లోకవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన బాబా రామ్‌దేవ్ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఆయన అనుభవం, విజ్ఞానం, సలహాలు రాష్ట్ర పర్యాటక రంగానికి ఎంతో మేలు చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను” అని పేర్కొన్నారు.
అలాగే, రాష్ట్రంలో పర్యాటకాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రణాళికలు రచిస్తున్నదని, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇటువంటి మార్గదర్శకుల సహకారం ఎంతో అవసరమని అన్నారు.
ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుందని సీఎం గర్వంగా ప్రకటించారు. యోగా కార్యక్రమాన్ని ఇంత విస్తృతంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందనలు తెలిపారని ఆయన గుర్తు చేశారు.
ఇక పరిపాలనలో పారదర్శకత, వేగం పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు సీఎం తెలిపారు.
“ఆగస్టు 15 నాటికి అన్ని ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం” అని స్పష్టం చేశారు.