Cm chandrababu: అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నేరాల రేటు తగ్గినప్పటికీ, కొన్ని జిల్లాల్లో మాత్రం నేరాలు పెరుగుతున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
అన్నమయ్య, కోనసీమ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో నేరాలు ఎందుకు పెరిగాయో లోతుగా విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కడప, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఆస్తి సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు కావడానికి గల కారణాలపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాల మధ్య నేరాల రేటులో ఉన్న వ్యత్యాసాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమావేశంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా నేరాల రేటు 5.5 శాతం తగ్గిందని తెలిపారు. ముఖ్యంగా మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. 16 జిల్లాల్లో నేరాలు తగ్గినప్పటికీ, కొన్ని జిల్లాల్లో వలస కూలీల కారణంగా ప్రత్యేకమైన నేర ధోరణి కనిపిస్తోందని వివరించారు. రాష్ట్రంలో డిటెక్షన్ రేటు 56 శాతం, రికవరీ రేటు 55 శాతంగా ఉందన్నార
విజయవాడ సీపీ రాజశేఖర బాబు మాట్లాడుతూ, టెక్నాలజీ వినియోగంతో నేరాలను సమర్థవంతంగా నియంత్రిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి సహా ఐదు జిల్లాల్లో సీసీటీవీ నెట్‌వర్క్ అనుసంధానంతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. నగరంలో కమ్యూనిటీ సహకారంతో 10 వేల సీసీ కెమెరాలతో డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసి, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా నిందితులను గుర్తిస్తున్నామని వెల్లడించారు.
మొత్తం మీద కొన్ని జిల్లాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను వెంటనే మెరుగుపరచి ప్రజల్లో భద్రతాభావం పెంచాలని పోలీసు ఉన్నతాధికారులకు గట్టిగా సూచించారు.
