Cm chandrababu: చిన్న చిన్న ఆలోచనలు ఒక్కోసారి సమాజంలో గొప్ప మార్పులకు దారి తీస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు.
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెంలో ఉన్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘ముస్తాబు కార్నర్’ను పరిశీలించిన చంద్రబాబు, విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఒక అధికా చొరవతో ప్రారంభమైన మంచి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం గర్వకారణమని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అమలు
నేటి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ‘ముస్తాబు’ కార్యక్రమం అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, మంచి అలవాట్లు అలవర్చుకోవడమే దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు.
పరిశుభ్రతతో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, పాఠశాలకు పరిశుభ్రంగా రావడం, యూనిఫాం చక్కగా ధరించడం, తల దువ్వుకోవడం, భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడుతాయని అన్నారు. ఈ అలవాట్లు విద్యపై దృష్టి పెంచడమే కాకుండా, నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందిస్తాయని తెలిపారు.
75 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
రాష్ట్రంలోని 75 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసిన చంద్రబాబు, త్వరలోనే వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ‘అమ్మకు వందనం’ పథకం ద్వారా ఆర్థిక సాయం, నాణ్యమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫార్ములు, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నామని గుర్తు చేశారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యారంగంలో వినూత్న సంస్కరణలు తీసుకొస్తున్నారని ప్రశంసించిన సీఎం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
