Cm chandrababu: విజయవాడలో జరిగిన మీడియా కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో, రాష్ట్రంలో 2029 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, కావాలంటే రాసిపెట్టుకోండని, ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాలుగోసారి ప్రధానమంత్రి అవుతారని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో అమరావతిలో రూ.50 వేల కోట్ల పనులు పూర్తవుతాయని, అమరావతిని నాలెడ్జ్ ఎకానమీగా, క్వాంటం సిటీగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఎంతో కీలకమని, దాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే 740 కిలోమీటర్ల దూరం కృష్ణమ్మను రాయలసీమకు, కుప్పానికి తరలించి నీరు అందించామని వివరించారు. కష్టాల్లోనూ ఈ ఏడాది రాష్ట్రం డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.
అభివృద్ధి కోసం పీపీపీ మోడల్స్ అనుసరిస్తున్నామని, దీని ద్వారా సంపద సృష్టి జరిగి ప్రభుత్వ ఆదాయం పెరిగి, ఆ ఆదాయంతో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసే శక్తి వస్తుందని అన్నారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్లమని, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.