Cm chandrababu: కృష్ణా నదీ జలాల వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపాయి. తన విజ్ఞప్తి మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (ఆర్‌ఎల్‌ఐఎస్) పనులను నిలిపివేశిందని రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. “నా మీద ఉన్న గౌరవంతోనే చంద్రబాబు ఆ పనులు ఆపేశారు” అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కృష్ణా జలాల విషయంలో అసలు ఏం జరిగిందో త్వరలోనే మీడియా ముందుకు వచ్చి అన్ని వాస్తవాలు వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జలాల పంపిణీ, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అంశాలపై నిజానిజాలు బయటపడతాయని చెప్పారు.
చంద్రబాబు వివరణ తర్వాత ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. కృష్ణా జలాల అంశం రెండు రాష్ట్రాల మధ్య మరోసారి కీలక రాజకీయ అంశంగా మారింది.
