Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తన 75వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీలకతీతంగా జాతీయ స్థాయి నేతలు, కూటమి నేతలు, టీడీపీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు భారీగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరి ప్రేమకు, అభిమానానికి స్పందనగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
“మీ అభిమానం, శుభాకాంక్షలతో నా హృదయం ఉప్పొంగింది. 75 ఏళ్ల జీవితం, 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మీ అందరి సహకారం విలువైనది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అపూర్వ గౌరవంగా భావిస్తున్నాను” అని పేర్కొన్నారు.
తన జన్మదినాన్ని పురస్కరించుకుని చంద్రబాబు ప్రజల పట్ల తన భద్రమైన సంకల్పాన్ని తెలియజేశారు. తెలుగు జాతి అభ్యున్నతికి పునరంకితమవుతానని, “స్వర్ణాంధ్ర 2047” విజన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలో శ్రేష్ఠ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.
అయన చెప్పిన ముఖ్యమైన అంశాలు ఇవీ:
ప్రతి పౌరుడి భవిష్యత్తుకు భరోసా కలిగించేలా పాలన అందిస్తానని హామీ
పీ4 కార్యక్రమం ద్వారా పేదలను స్వర్ణ కుటుంబాలుగా మార్చాలన్న ఆశయం
అసమానతలు తగ్గించాలన్న సంకల్పం
అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం
‘థింక్ గ్లోబల్లీ – యాక్ట్ లోకల్లీ’ సిద్ధాంతంతో రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా మలచాలన్న దృక్పథం
ప్రపంచవ్యాప్తంగా తెలుగువాళ్ల విజయాలు గర్వకారణంగా మారుతున్నాయని భావన
2047 నాటికి తెలుగు జాతిని ప్రపంచంలో శక్తిమంతమైన జాతిగా నిలిపేందుకు కృషి
చివరిగా, పల్లెల నుంచి ప్రపంచ దాకా తమ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకూ, నాయకులకూ, అభిమానులకూ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.