Cm chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో పీ4 (జీరో పావర్టీ) కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా మలచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా తానే స్వయంగా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ యజ్ఞంలో తన కుటుంబ సభ్యులూ భాగస్వాములవుతారని తెలిపారు.
సచివాలయంలో పీ4 కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, “పేద కుటుంబాలను సాధికారతతో ముందుకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందన్నారు.
గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ఆ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు స్థానికంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటివరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా, 57,503 మంది మార్గదర్శులుగా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరో రెండు లక్షల మార్గదర్శులు అవసరమని వివరించారు.
దత్తత ప్రక్రియలో పల్నాడు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, విశాఖపట్నం జిల్లా చివరిలో ఉందని వెల్లడించారు. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆటోమేటెడ్ మెసేజ్‌ల రూపంలో సమాచారాన్ని సమయానికి అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.