Cm chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని స్వల్ప మార్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ నెల 31న జిల్లాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
శనివారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులపై సీఎం సమగ్రంగా చర్చించారు. గత నెల 27న విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై నెల రోజుల పాటు ప్రజాభిప్రాయాలను స్వీకరించగా, రాష్ట్రవ్యాప్తంగా 927 అభ్యంతరాలు, సూచనలు అందినట్లు అధికారులు తెలిపారు.
నెల్లూరు జిల్లాలోనే గూడూరు – ప్రజాభిప్రాయానికి గౌరవం
ప్రజల నుంచి వచ్చిన తీవ్ర డిమాండ్‌ను గౌరవిస్తూ, గూడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రజాభిప్రాయాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.
అనకాపల్లి, మార్కాపురం జిల్లాల్లో కీలక మార్పులు
అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్ స్థానంలో అడ్డరోడ్డు జంక్షన్‌ను కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్‌లో, అచ్యుతాపురం మండలాన్ని అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌లో చేర్చనున్నారు.
మార్కాపురం జిల్లా పరిధిలోకి దొనకొండ, కురిచేడు మండలాలను చేర్చాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
పోలవరం జిల్లా యథావిధిగా
రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటుకానున్న పోలవరం జిల్లాలో ఎలాంటి మార్పులు చేయకుండా, ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారమే కొనసాగించాలని సీఎం సూచించారు.
ఆదోని పట్టణ విభజనపై ఏకాభిప్రాయం
విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న ఆదోని పట్టణాన్ని రెండు మండలాలుగా విభజించాలనే ప్రతిపాదనపై సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.
రైల్వే కోడూరు, రాయచోటి, రాజంపేట తదితర ప్రాంతాలపై చర్చ జరిగినప్పటికీ, ఈ అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ప్రాథమిక నోటిఫికేషన్ మేరకు కొనసాగనున్న మార్పులు కొన్ని మండలాలు, డివిజన్ల మార్పులు ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారమే యథావిధిగా కొనసాగనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మార్పులన్నింటితో ఈ నెల 31న జిల్లాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సమీక్షా సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
