CM Chandrababu

CM Chandrababu: సాంకేతికతతో తుఫాను నష్టాన్ని తగ్గించాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన మొంథా తుఫాను సృష్టించిన బీభత్సంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. తుఫాను నష్టాన్ని, దానిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం చూపిన సమర్థతను ఆయన  అమరావతిలో ఉన్నతాధికారుల సమావేశంలో వివరించారు.

తుఫాను తీరు ఒక రకంగా దాగుడుమూతలు ఆడినప్పటికీ, ముందస్తుగా చేసిన అంచనాలు, శాటిలైట్ ఇమేజ్‌లు, జియోట్యాగింగ్ వంటి సాంకేతికతను సమర్థంగా ఉపయోగించడం వల్లే నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని సీఎం తెలిపారు. మొదట కాకినాడ వైపు వస్తుందని భావించిన తుఫాను, చివరకు అంతర్వేది వద్ద తీరం దాటిందని, వర్షాలు కూడా అనుకోని ప్రాంతాల్లో ఎక్కువగా కురిశాయని ఆయన పేర్కొన్నారు.

సత్వర స్పందన, వేగవంతమైన పునరుద్ధరణ
తుఫాను సమయంలో ప్రభుత్వ యంత్రాంగం చూపిన వేగాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో తుఫాను సమయంలో విద్యుత్ సరఫరా ఆగితే మళ్లీ రావడానికి 10 గంటల సమయం పట్టేదని, ఇప్పుడు కేవలం 3 గంటల్లోనే పునరుద్ధరణ జరిగింది. అలాగే, కూలిపోయిన చెట్లను తొలగించడానికి గతంలో వారం రోజులు పట్టేదని, కానీ ఈసారి వర్షాలు పడుతున్నా వెంటనే పనులు చేపట్టి రోడ్లను శుభ్రం చేశారని, రవాణాకు ఇబ్బంది లేకుండా చూశారని అధికారుల పనితీరును ప్రశంసించారు.

పెన్షన్ల పంపిణీలో కూడా వేగం కనిపించిందని, గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లతో చేసిన పనిని, ప్రస్తుతం 1.60 లక్షల మందితోనే మూడు గంటల్లో పూర్తి చేశామని, ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. పునరావాస కేంద్రాల్లో గర్భిణీలకు ప్రత్యేక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేయడం వంటి ముందస్తు చర్యలు నష్టాన్ని అదుపులో ఉంచాయని ఆయన తెలిపారు.

Also Read: Hyderabad: అజారుద్దీన్‌కు మంత్రి పదవి — ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

రూ.5,265 కోట్ల ప్రాథమిక నష్టం
మొంథా తుఫాను వల్ల రాష్ట్రానికి మొత్తం రూ.5,265 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినప్పటికీ, ఆస్తులు, పంటలు భారీగా దెబ్బతిన్నాయి.

రోడ్లు, భవనాల (R&B) శాఖకే అత్యధికంగా రూ.2,079 కోట్లు నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఆక్వా రంగం రూ.1,270 కోట్లతో తీవ్రంగా దెబ్బతింది. వ్యవసాయ రంగానికి రూ.829 కోట్లు నష్టం వాటిల్లగా, ఉద్యాన, సెరికల్చర్, మున్సిపల్ శాఖలు కూడా నష్టపోయాయి. తుఫాను కారణంగా 120 పశువులు చనిపోయాయని, దీనివల్ల రూ.71 లక్షల నష్టం వాటిల్లిందని సీఎం వెల్లడించారు. రైతులు నష్టపోయిన వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంట నష్టంపై ఐదు రోజుల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *