Cm chandrababu: చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు తిరగనందుకే ఓ మహిళను చెట్టుకు కట్టేసి అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. బాధితురాలు శిరీషతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడిన సీఎం, ఆమెను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పూర్తి సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, గతంలో కూడా తమపై అణచివేతకు పాల్పడ్డారా? అని శిరీషను ప్రశ్నించగా, ఆమె పలు సందర్భాల్లో తమను వేధించారని బాధతో వెల్లడించింది. ఈ ఘటనలో తాను, పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ అమానుష ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ‘‘ఇలాంటి అనాగరిక చర్యలు ఎంతమాత్రం సహించం. మానవత్వం కోల్పోయినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించా,’’ అని స్పష్టం చేశారు.
శిరీష పిల్లల విద్యాపై కూడా సీఎం ఆసక్తి చూపారు. వారు ఏ తరగతి చదువుతున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనే విషయాలను తెలుసుకుని, పిల్లల చదువుపై ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. శిరీష కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు.
శిరీష ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, వెంటనే ₹5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆమెకు ధైర్యం చెప్పుతూ, ప్రభుత్వం తరఫున పూర్తి అండగా నిలబడతామని తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అవసరమైన సాయం వెంటనే అందించాలన్నదిగా సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. ‘‘అవమానాలు ఎదుర్కొన్న శిరీషకు న్యాయం జరిగేలా చూస్తాం’’ అని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారు.