Cm chandrababu: ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై అధికారులను సీఎం ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
రాష్ట్రంలోని అమరావతి, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో డీ-ఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మత్తు పదార్థాల నియంత్రణకు ఇది కీలకమని, అవసరమైన వసతులు వెంటనే కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు.
అలాగే వీధి దీపాలు, తాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని సీఎం హెచ్చరించారు. సరఫరా చేసే తాగునీటికి తరచూ నాణ్యత పరీక్షలు నిర్వహించాలని, ఎక్కడైనా నీరు కలుషితమైతే వెంటనే అప్రమత్తమై సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
ఆర్వో ప్లాంట్లు లేని హాస్టళ్లలో వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని, సేవల్లో ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
