CJI Sanjiv Khanna: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం నేటితో ముగిసింది. సుప్రీంకోర్టులో చివరి రోజు బెంచ్ కార్యలాపాలు ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ ఖన్నా మీడియాతో మాట్లాడుతూ. తదుపరి ఎటువంటి అధికారిక పదవులను చేపట్టనని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలోనే ఏదైనా చేయాలనుకుంటున్నానని చెప్పారు. మరోవైపు జస్టిస్ ఖన్నా పదవీ విరమణ నేపథ్యంలో సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది.
భారత 51వ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ సంజీవ్ ఖన్నా గతేడాది నవంబర్ 11 బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాకు దివంగత మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా సమీప బంధువు. 2005లో దిల్లీ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులైన జస్టిస్ ఖన్నా.. ఆ మరుసటి ఏడాది శాశ్వత న్యాయమూర్తిగా ఉన్నతి పొందారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, నవంబర్ 11న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు.
తదుపరి సీజేఐగా జస్టిస్ బి.ఆర్. గవాయ్
భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మే 14న బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నూతన సీజేఐతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ గవాయ్ పేరును.. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గతంలోనే సిఫారసు చేయడంతో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 6 నెలలకుపైగా సీజేఐ పదవిలో కొనసాగనున్న జస్టిస్ గవాయ్.. నవంబరు 23న పదవీ విరమణ చేస్తారు.

