CJI B.R Gavai: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న రాజకీయ అస్థిరతను ప్రస్తావిస్తూ, భారత రాజ్యాంగం పటిష్ఠతపై గర్వం వ్యక్తం చేశారు. ఒక కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నేపాల్‌లో యువత నిరసనలు హింసాత్మకంగా మారి, రాజకీయ సంక్షోభం తలెత్తింది. సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం కారణంగా మొదలైన ఈ నిరసనలు, తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందాయి. నిరసనకారులు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను తగలబెట్టడంతో దేశవ్యాప్తంగా అల్లకల్లోలం నెలకొంది. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి నేపాల్ సైన్యం కఠిన ఆంక్షలు విధించి, ప్రజలు గుంపులుగా గుమిగూడడంపై నిషేధం విధించింది. గత మూడు రోజుల్లో 18 జిల్లాల నుంచి 6,000 మందికి పైగా ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకున్నారు.
ఇక బంగ్లాదేశ్‌లో కూడా ఇటీవల హింసాత్మక నిరసనలు చెలరేగాయి. ఈ నిరసనల కారణంగా అక్కడి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్‌లో తలదాచుకున్నారు. ఈ రెండు దేశాల్లోని అస్థిర పరిస్థితులను సూచిస్తూ, జస్టిస్ గవాయ్, “మన రాజ్యాంగం చూసి గర్వపడుతున్నాం. పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో గమనించండి,” అని అన్నారు.
Also Read: Iphone: ఇకనుంచి ఇండియాలోనే తయారీ..
ఈ వ్యాఖ్యలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోరిన అభిప్రాయంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ సందర్భంగా వచ్చాయి. రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో గవర్నర్లు ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు గడువు నిర్దేశించిన నేపథ్యంలో ఈ చర్చ జరిగింది. జస్టిస్ గవాయ్ అధ్యక్షతన గల ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్ సభ్యులుగా ఉన్నారు.
జస్టిస్ విక్రమ్ నాథ్ కూడా గవాయ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ, “అవును, బంగ్లాదేశ్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది,” అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రజల హక్కులను కాపాడేందుకు బలమైన పునాదిని అందిస్తుందని, ఇది దేశంలో స్థిరత్వానికి కారణమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.