Nepal: పొలిటికల్ లీడర్స్ అవినీతి, అక్రమాలపై దేశ ప్రజల్లో పేరుకుపోయిన కోపం నేపాల్‌లో అంతర్యుద్ధానికి దారితీసింది. పౌరుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నేపాల్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ఈ హింసాత్మక ఆందోళనల్లో ఇప్పటివరకు 22 మందికి పైగా చనిపోయారు.
నేపాల్‌లో ఘర్షణలకు కారణం?
కొద్ది రోజులుగా నేపాల్‌లో ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా యువత ఈ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అయితే, ఇవి హింసాత్మకంగా మారడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనకారులు రాజధాని ఖాట్మండులో ప్రభుత్వ భవనాలను, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో 22 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు.
దేశవ్యాప్తంగా కర్ఫ్యూ, కఠిన ఆంక్షలు
పరిస్థితిని అదుపు చేయడానికి నేపాల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేయబడింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సైన్యం పూర్తి పగ్గాలు చేపట్టిందని అధికారులు ప్రకటించారు.
అప్రమత్తమైన భారత్
నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. న్యూ ఢిల్లీలోని నేపాల్ రాయబార కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దుల గుండా ఎవరూ రాకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

