Vijayasai Reddy: కాకినాడ సీ పోర్ట్, సెజ్ వ్యవహారంలో మరోసారి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న మళ్లీ విచారణకు హాజరుకావాలని ఆయనకు సమాచారం అందజేశారు. గత బుధవారం విజయవాడ సీఐడీ కార్యాలయంలో జరిగిన విచారణలో ఆయనను ఐదు గంటలపాటు ప్రశ్నించిన అధికారులు, అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సిందిగా సూచించారు.
విజయసాయి రెడ్డి, కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారనే ఆరోపణలపై మంగళగిరి సీఐడీ వారు గతంలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వాటాలు ఎలా బదిలీ అయ్యాయి? బలవంతంగా తీసుకున్నారా? ఇందులో ఎవరి పాత్ర ఎంత? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు చేశారు. కేవీ రావు ఫిర్యాదు మేరకు ఈ కేసులో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
Also Read: Pawan Kalyan-Botsa: ఏపీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ – బొత్స మధ్య ఆసక్తికర సంభాషణ
Vijayasai Reddy: కేసులో ప్రధాన నిందితులుగా విక్రాంత్ రెడ్డి (A-1), విజయసాయి రెడ్డి (A-2), శరత్ చంద్రారెడ్డి (A-3), శ్రీధర్ (A-4), అరబిందో రియాల్టీ ఇన్‌ఫ్రా (A-5) ఉన్నారని సీఐడీ వెల్లడించింది. గతంలో విజయసాయి రెడ్డికి అందించిన నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120(B) రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.