CIBIL Score: ప్రస్తుత కాలంలో సిబిల్ స్కోర్ ప్రతి ఇంటినీ నడిపిస్తున్నది. చాలీచాలని వేతనాలతో ఇండ్లు గడవడం కష్టమవుతున్న ఈ తరుణంలో లోన్లు, వాయిదాల రూపంలో ఎన్నో కుటుంబాలు నెట్టుకొస్తున్నాయి. కొందరికి సిబిల్ స్కోర్ లేక.. ఆ లోన్లు అందక, వాయిదాలకు అవకాశాలు లేక సతమతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఉద్యోగాలకు సిబిల్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సిబిల్ స్కోర్ ఉంటేనే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇక్కడ ఏకంగా ఓ వ్యక్తి ఉన్న ఉద్యోగాన్నే కోల్పోయాడు.
CIBIL Score: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఎస్‌బీఐ శాఖలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో)గా కార్తికేయన్ మంచి వేతనంతో పనిచేస్తున్నారు. అయితే ఆయనకు ఉన్నట్టుండి సిబిల్ స్కోర్ తక్కువైంది. ఈ విషయాన్ని బ్యాంకు పై అధికారులు గుర్తించారు. ఈ కారణంగానే ఆయనను ఎస్‌బీఐ సీబీవో ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించారు.
CIBIL Score: తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని, సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నదన్న కారణంగా సరికాదని పేర్కొంటూ కార్తికేయన్ చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాధనం నిర్వహించే వ్యక్తికి ఆర్థిక క్రమ శిక్షణ అవసరమని, రుణాలు తీసుకొని కట్టకుండా, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వారిపై నమ్మకం ఎలా కలుగుతుందని, ఎస్‌బీఐ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు చెన్నై హైకోర్టు తేల్చి చెప్పింది. కార్తికేయన్ రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
CIBIL Score: ఈ తీర్పు ప్రతి వ్యక్తి సిబిల్ స్కోర్‌ను మెయింటెయన్ చేయాల్సిందేనని హైకోర్టు తెలియచెప్పిందన్నమాట. మేము ఇతరుల సిబిల్ స్కోర్ చూస్తాం. కానీ, మా సిబిల్ స్కోర్ చూసేదెవరు? అన్న ధీమా కూడా ఉద్యోగులకు పనికిరాదని చెంపపెట్టులాంటి ఆదేశాలిచ్చింది. అంటే ప్రతి వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిందేనని చెన్నై హైకోర్టు సూచించింది.

