Christ: దేశంలోనే అత్యంత ఎత్తయిన ఏసుక్రీస్తు విగ్రహం ఏర్పాటుకు సంబంధించి కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలోని కనకపుర నియోజకవర్గంలో 114 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ వ్యవహారంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
తాజాగా బెంగళూరులో బాల్డ్విన్ మెథడిస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహించిన యునైటెడ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న డీకే శివకుమార్ ఈ అంశంపై స్పందించారు. తన నియోజకవర్గమైన కనకపురలో 114 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహం నిర్మాణానికి భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగానే జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నా నియోజకవర్గంలో ఏసు విగ్రహ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి 10 ఎకరాల భూమిని కేటాయించేలా చూశాను. ఇందుకు ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని నేనే వ్యక్తిగతంగా చెల్లించాను” అని వెల్లడించారు. ఈ విషయంలో తనపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయని, అయినప్పటికీ తాను చట్ట పరిధిలోనే వ్యవహరించానని డీకే శివకుమార్ తెలిపారు.
కనకపుర పరిధిలోని హరోబెలె కపాలబెట్ట కొండపై ఈ 114 అడుగుల ఏకశిలా ఏసుక్రీస్తు విగ్రహాన్ని నిర్మించేందుకు హరోబెలె కపాలబెట్ట డెవలప్మెంట్ ట్రస్ట్‌తో కలిసి ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. అయితే భూ కేటాయింపులకు సంబంధించి న్యాయపరమైన వివాదాలు తలెత్తడంతో పాటు, ఈ విగ్రహ ఏర్పాటుపై బీజేపీతో పాటు పలు హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
దీంతో ఈ వ్యవహారం కోర్టు దృష్టికి వెళ్లగా, కర్ణాటక హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం విగ్రహ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ అంశంపై తుది తీర్పు రావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, ఈ విగ్రహ నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించాల్సి రావడంతో తాను క్రిస్మస్ వేడుకలకు రెండు గంటలు ఆలస్యంగా హాజరైనట్లు డీకే శివకుమార్ తెలిపారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, మానవత్వమే తనకు ప్రధానమని ఆయన వ్యాఖ్యానించారు.

