Chittoor: అది.. చిత్తూరు జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్.. ఉదయం 6:30 గంటలకే పోలీసుల హడావుడి. పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం. పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ లోకి ఆరుగురు దుండగులు చొరబడ్డారన్న సమాచారంతో పోలీసులు అలర్టయ్యారు.. దుండగుల దాడిలో గాయపడి తప్పించుకున్న యజమాని చంద్రశేఖర్ దుండగులు వద్ద తుపాకులు ఉన్నట్లు చెప్పడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
చిత్తూరు ఎస్పీకి సమాచారం ఇచ్చిన టూ టౌన్ పోలీసులు స్థానికుల సహాయంతో ఆపరేషన్ ప్రారంభించారు. షాప్ లోకి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నం చేసారు.. క్షణం క్షణం ఉత్కంఠ.. మూడు గంటలకుపైగా శ్రమించారు. అప్పటికే స్థానికుల సహాయంతో పోలీసులు ముగ్గురు దుండగులను అదుపులో తీసుకున్నారు.. అయితే.. పోలీసులు హడావిడిని చూసి భయంతో భవనం పైనుంచి దూకి మరో దుండగుడు ఆసుపత్రి పాలు అయ్యాడు.
అయితే.. పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ లోకి చొరబడ్డ ఆరుగురు దుండగుల్లో ఇద్దరు లోపలే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. వారి దగ్గర తుపాకులు ఉన్నట్లు చెప్పడంతో లోపలికి వెళ్ళే సాహసం చేయలేక పోయారు. దుండగులను ప్రతిఘటించి బయటకు వచ్చిన యజమాని చంద్రశేఖర్ నుంచి వివరాలు సేకరించిన ఎస్పీ మణికంఠ చందోలు స్వయంగా ఆపరేషన్ ను పర్యవేక్షించారు.
ఇది కూడా చదవండి: YS Jagan: ఎల్లప్పుడూ ప్రజల వెంటే.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే
తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న మినీ వ్యాన్ లో వచ్చిన ఆరుగురు దుండగులు.. ఐడీబీఐ ముందే మినీ వ్యాన్ ను పార్క్ చేసి లోపైకి దర్జాగా వెళ్ళారు. పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ పక్కనే ఐడిబిఐ బ్యాంకు ఉండటంతో దుండగులు టార్గెట్ ఏంటన్న దానిపై పోలీసులు పలు కోణాల్లో ఆలోచించారు. దుండగులు ప్రయాణించిన వ్యాన్ లో ఉన్న మారణాయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, షాపు లోనే ఉండిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం ఆపరేషన్ కొనసాగించారు. ఆక్టోపస్ బలగాలను కూడా రంగంలోకి దింపారు. పుష్ప కిడ్స్ వరల్డ్ షాపులోకి చొరబడ్డ దుండగుల్లో పట్టుబడ్డ ముగ్గుర్ని విచారించిన ఎస్పీ మణికంఠ చందోలు.. షాపు యజమాని చంద్రశేఖర్ నుంచి కూడా వివరాలు సేకరించారు.. ఎట్టకేలకు దోపిడీకే దుండగులు వచ్చినట్లు భావించిన పోలీసులు.. ఆపరేషన్ ప్రారంభించి చంద్రశేఖర్ కు చెందిన మూడు అంతస్తుల భవనంలో ఉండిపోయిన ఇద్దర్ని పట్టుకున్నారు.
అయితే.. హిందీ – తెలుగు మాట్లాడుతున్న దుండగుల నుంచి ఎట్టకేలకు క్లూ కనిపెట్టిన ఎస్పీ.. ఈ ప్లాన్ కు చిత్తూరులోని ఒక ఫర్నిచర్ షాప్ కు చెందిన వ్యక్తి కీలకమని గుర్తించారు. చంద్రశేఖర్ బిల్డింగ్ కు ఫర్నిచర్ చేసిన ఆ వ్యక్తే దుండగులతో దోపిడీకి ప్రయత్నించినట్లు అనుమానించారు. ఎట్టకేలకు ఎస్ఎల్వీ ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం కోసం ఆరా తీసిన పోలీసులు.. చిత్తూరు చోరీ కేసును చేధించారు.

