POCSO Act: చిత్తూరు జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికపై వరుసగా అఘాయిత్యానికి పాల్పడి, ఆమె గర్భం దాల్చడానికి కారణమైన కామాంధుడిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలంలోని బుచ్చిరెడ్డి కండ్రిగ గ్రామానికి చెందిన మురళి (49) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఈ ఏడాది ఆగస్టు 24న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను గదిలో నిర్బంధించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడి బెదిరింపులకు భయపడిన బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది.
వెలుగులోకి వచ్చిన వైనం
ఇటీవల డిసెంబర్ 18న బాలిక తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటంతో కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా, బాలిక గర్భం దాల్చిన విషయం బయటపడింది. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా, మురళి చేసిన అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Winter Diseases: శీతాకాలపు సవాల్.. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న ఇన్ఫెక్షన్లు!
పోలీసుల మెరుపు దాడులు – 6 గంటల్లోనే అరెస్ట్
బాలిక తల్లి డిసెంబర్ 19న వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న నగరి డీఎస్పీ అజీజ్ అహమ్మద్ నేతృత్వంలో పోలీసులు తక్షణమే విచారణ చేపట్టారు.
నిందితుడు మురళిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన కేవలం 6 గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు.
బాధితురాలికి ప్రస్తుతం వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

