Mega 157: అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచి, వసూళ్ల పరంగా కూడా రికార్డులు తిరగరాసింది. ఇది కేవలం ఓ సినిమా కాదు, వెంకీ ఫ్యాన్స్‌కు పండగ లాంటి అనుభూతిని మిగిల్చింది. ఇప్పుడు ఆ జోష్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు అనిల్ రావిపూడి సిద్ధమయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన తన తదుపరి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఉగాది సందర్భంగా గ్రాండ్‌గా లాంచ్ కాగా, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వెంకటేష్ బాటలోనే చిరంజీవి కూడా పయనించేందుకు రెడీ అవుతున్నారట. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకటేష్ ఓ పాట పాడి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగా 157 చిత్రంలో చిరంజీవి కూడా ఓ సాంగ్‌తో గొంతు కలపనున్నారని టాక్. అనిల్ రావిపూడి ఈ ఆలోచనను మెగాస్టార్ ముందు పెట్టగా, చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో వెంకీ స్టైల్‌లో చిరు కూడా సందడి చేయనున్నారనేది ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. మొత్తంగా ఈ కాంబో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
