Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి సంబంధించి జరిగిన వాస్తవాలను ఆయన ఒక పత్రికా ప్రకటన ద్వారా వివరించారు. ఈ చర్చలో తన పేరు ప్రస్తావనకు వచ్చినందున ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చిరంజీవి పేర్కొన్నారు.
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ప్రభుత్వాన్ని సంప్రదించమని అప్పటి నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తనను కోరారని చిరంజీవి తెలిపారు. ఆ సమయంలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు తనను కలిసి ఈ విషయంపై చొరవ తీసుకోవాలని కోరారని ఆయన పేర్కొన్నారు.
వారి సూచనల మేరకు అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో మాట్లాడగా, ముఖ్యమంత్రి జగన్ మొదట తనతో వన్-టూ-వన్ భేటీకి ఆహ్వానించారని చిరంజీవి చెప్పారు. లంచ్ సందర్భంగా జగన్‌ను కలిసినప్పుడు, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించానని, పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ గురించి తెలియజేశానని అన్నారు. అందరితో కలిసి రావడానికి సమయం ఇవ్వాలని కోరడంతో జగన్ అంగీకరించారని, ఆ తర్వాత ఐదుగురు మాత్రమే రావాలని పేర్ని నాని చెప్పినప్పటికీ, పది మందిని తీసుకెళ్లడానికి అనుమతి లభించిందని చిరంజీవి వివరించారు.
Also Read: CM Chandrababu: మెగా డీఎస్సీ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: సీఎం చంద్రబాబు
ఆ భేటీకి ముందు బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించానని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదని చిరంజీవి తెలిపారు. ఆ తర్వాత జెమినీ కిరణ్‌ను పంపించి మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారని అన్నారు. ఈ భేటీకి బాలకృష్ణ హాజరు కాలేకపోయినప్పటికీ, ఆర్. నారాయణమూర్తితో సహా మరికొంతమంది ప్రముఖులు జగన్‌ను కలిశారని చెప్పారు. తాను చొరవ తీసుకోవడం వల్లే ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు అంగీకరించిందని, దాని వల్ల తమ సినిమా ‘వాల్తేరు వీరయ్య’తో పాటు బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’కి కూడా లాభం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
చిరంజీవి తన సహజ ధోరణిలోనే అందరితో గౌరవంగా వ్యవహరిస్తానని, ప్రస్తుతం తాను ఇండియాలో లేనందున పత్రికా ప్రకటన ద్వారా ఈ వివరణ ఇస్తున్నానని తెలిపారు. బాలకృష్ణ తనపై వ్యంగ్యంగా మాట్లాడినప్పటికీ, తాను మాత్రం వాస్తవాలను మాత్రమే తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు.