Chiranjeevi Deepfake Case

Chiranjeevi Deepfake Case: AIతో చిరంజీవి ఫొటోలు మార్ఫింగ్.. కేసు నమోదు

Chiranjeevi Deepfake Case: సోషల్‌ మీడియాలో వేగంగా విస్తరిస్తున్న డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ఇప్పుడు టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవిని కూడా వదల్లేదు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో ఆయన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి అశ్లీల కంటెంట్‌గా మార్చి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు, కొన్ని వెబ్‌సైట్లలో పోస్టు చేయడం కలకలం రేపుతోంది. చిరంజీవి వ్యక్తిత్వాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా తయారుచేసిన ఈ డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మెగాస్టార్‌ స్వయంగా హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌‌కి ఫిర్యాదు చేయడంతో పాటు సిటీ సివిల్‌ కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ చర్యలతో పాటు, పోలీసులు సంబంధిత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ISRO: మరో రాకెట్‌ను సిద్ధం చేసిన ఇస్రో.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..!

దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కృషితో సంపాదించిన కీర్తిని, డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ద్వారా కొన్ని నిమిషాల్లో మసకబార్చడం పట్ల సినీ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో “ఇలాంటి చెడు చర్యలను కఠినంగా అరికట్టాలి” అని డిమాండ్‌ చేస్తున్నారు.

సైబర్‌ నిపుణులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, “AI సాయంతో వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్‌ చేయడం తీవ్రమైన నేరం. ఇలాంటి కంటెంట్‌ను తయారు చేసినా, షేర్‌ చేసినా, ఫార్వర్డ్‌ చేసినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.

ఇటీవలి కాలంలో డీప్‌ఫేక్‌లు హీరోయిన్లను వేధించినా, ఇప్పుడు హీరోలకూ ఈ ముప్పు పెరుగుతోంది. సాంకేతికతను దుర్వినియోగం చేసే ఈ ఘటన మరోసారి ఆన్‌లైన్‌ భద్రతపై చర్చను రేకెత్తించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *