Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యారని, ఆమెను ఆసుపత్రిలో చేర్పించినట్లు ఉదయం నుంచి వార్తలు వెలువడుతున్నాయి. ఈ తెల్లవారుజామునే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తరలించినట్లు సమాచారం.
అంజనాదేవి ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, విజయవాడలో ఆయనకు అనుకున్న కొన్ని అధికారిక కార్యక్రమాలు, సమీక్ష సమావేశాలను రద్దు చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
అయితే, అంజనాదేవి గారి ఆరోగ్యంపై వచ్చిన వార్తలపై చిరంజీవి టీమ్ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం గత వారం ఆసుపత్రికి వెళ్లినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పూర్తిగా బాగానే ఉందని, అనవసరమైన పుకార్లను నమ్మొద్దని స్పష్టం చేశారు.