Chirag Paswan

Chirag Paswan: బిహార్‌లో ఎన్డీయే విజయానికి యువ శక్తి! 75% స్ట్రైక్ రేట్‌తో చిరాగ్ పాసవాన్ సంచలనం

Chirag Paswan: దేశవ్యాప్తంగా రాజకీయ దృష్టిని ఆకర్షించిన బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటి, కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ విజయంలో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) గతంతో పోలిస్తే మంచి సీట్లు సాధించగా, అతిపెద్ద భాగస్వామ్య పక్షమైన భారతీయ జనతా పార్టీ (భాజపా) కూడా మెరుగైన ప్రదర్శన చేసింది.

అయితే, ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన, ఊహించని విజయాన్ని నమోదు చేసిన యువ నాయకుడు చిరాగ్ పాసవాన్. ఆయన నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) – LJP (RV) కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించింది. మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన LJP (RV) అసాధారణంగా 75 శాతం స్ట్రైక్ రేట్‌తో 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగడం విశేషం. గత ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికే పరిమితమైన ఆ పార్టీ, ఈసారి అద్భుతమైన పునరాగమనం చేసింది. ఒకప్పుడు తన తండ్రి నెలకొల్పిన పార్టీలో విభేదాలు, విమర్శలు ఎదుర్కొన్న చిరాగ్, ఇప్పుడు తన దళిత నాయకత్వ వారసత్వాన్ని బలంగా నిలబెట్టుకున్నారు.

రాజకీయ ప్రస్థానం ఎప్పుడూ సాఫీగా సాగని చిరాగ్ పాసవాన్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లారు. అప్పుడు ఎన్డీయే కూటమిలోనే ఉన్నప్పటికీ, ఆయన నితీశ్‌ కుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. భాజపాకు మద్దతు ఇస్తూనే, జేడీయూ అభ్యర్థులకు వ్యతిరేకంగా 137 సీట్లలో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో LJP కేవలం ఒకే సీటు గెలిచినా, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అది జేడీయూ ఓట్లను చీల్చడంలో ప్రధాన పాత్ర పోషించింది. 2015లో 71 సీట్లు సాధించిన జేడీయూ, 2020లో కేవలం 43 స్థానాలకే పరిమితం కావడానికి ఇది ఒక కారణంగా నిలిచింది.

ఆ తర్వాత, తన బాబాయ్ పశుపతి కుమార్‌ పరాస్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా, LJP ఎంపీలు ఫిరాయించారు. ఎన్నికల సంఘం పార్టీ గుర్తును తాత్కాలికంగా నిలిపివేయడంతో, చిరాగ్ 2021లో ఎల్జేపీ (రామ్ విలాస్) పేరిట కొత్త పార్టీని స్థాపించాల్సి వచ్చింది.

Also Read: Local Body Elections: మున్సిప‌ల్ ఎన్నిక‌లపై కొత్త అప్‌డేట్‌!

లోక్‌సభలో 100% సక్సెస్, అసెంబ్లీలో మెరుపు
పార్టీ సంక్షోభం తర్వాత, చిరాగ్ “యువ బిహారీ” నినాదంతో ప్రజల్లోకి వెళ్లి, దళిత నాయకుడిగా తనను తాను బలంగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని నిలబెట్టే దిశగా ఆయన చేసిన కృషి ఫలితాన్నిచ్చింది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో, చిరాగ్ నేతృత్వంలోని LJP (RV) ఎన్డీయే కూటమిలో భాగంగా పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్‌ను నమోదు చేసింది. ఈ ఘన విజయంతో ఆయన కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో, భాజపా, జేడీయూ మొదట్లో 20 స్థానాలకు మించి కేటాయించడానికి అంగీకరించకపోయినా, చివరకు 29 స్థానాలను కేటాయించాయి. ఈ ఎన్నికల్లో LJP (RV) అద్భుతమైన ప్రదర్శనతో 22 స్థానాల్లో ముందంజలో ఉంది. బిహార్ రాజకీయాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో సమానంగా 43 ఏళ్ల చిరాగ్ కూడా కీలక పాత్ర పోషించారు. కొందరు విశ్లేషకులు ఈ విజయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ జనసేన విజయంతో పోలుస్తున్నారు.

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, ఎన్డీయే ప్రభుత్వంలో చిరాగ్ పాసవాన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2029లో మళ్లీ మోదీని ప్రధాని చేయడమే తన లక్ష్యమని చిరాగ్ ప్రకటించినప్పటికీ, బిహార్‌లో అత్యున్నత స్థానంలో తనను చూడాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆయన మీడియాకు తెలిపారు. మొత్తానికి, చిరాగ్ అసాధారణ పోరాటం ఎన్డీయే విజయంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *