China: గంటకు 501 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మాగ్లెవ్ రైళ్లను ప్రవేశపెట్టి రికార్డులు సృష్టిస్తున్న చైనా.. మరో రైలు విప్లవానికి నాంది పలుకనున్నది. ప్రపంచమే అబ్బురపడేలా ఆ రైలును తీసుకురానున్నది. ఏకంగా శబ్ద వేగాన్ని ఛేదించే సూపర్ సోనిక్ రైలును సిద్ధం చేస్తున్నది. ఈ రైలు కనుక పట్టాలను ఎక్కితే కేవలం అర్ధగంటలోనే 700 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది.
China: చైనా వార్తా సంస్థల సమాచారం మేరకు.. ఆ దేశంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలు ఈ సూపర్ సోనిక్ రైలు ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. విద్యుదయస్కాంత స్లెడ్జ్ అని పిలిచే ఈ వ్యవస్థ.. విద్యుదయస్కాంత శక్తితో వాహనాన్ని గాలిలోకి వేగంగా నెడుతుంది. ఫలితంగా వాయువేగంతో శబ్ద వేగానికంటే ముందే గమ్యాన్ని చేరుకుంటుంది. అంటే విమానం కంటే వేగంగా ఈ రైలు ప్రయాణిస్తుందన్నమాట.
China: 98.9 శాతం కచ్చితత్వంతో వేగాన్ని ట్రాక్ చేసే అల్గారిథాన్ని శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేస్తున్నది. అత్యంత వేగంతో ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే పనిలో పడింది. ముఖ్యంగా షాక్ వేవ్స్ వల్ల రైలు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీనికోసం విద్యుత్తు సరఫరాలో వచ్చే మార్పులను వినడం ద్వారా వేగాన్ని అంచనా వేసేలా ఒక వినూత్న సాంకేతికతను డెవలప్ చేశారు. ఇప్పుడు చిన్నపాటి సాంకేతిక లోపాలను సరిదిద్దే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇది పూర్తయితే త్వరలోనే ఈ రైలు పట్టాలెక్కనున్నది. ఇది జరిగితే ప్రపంచంలో మరో విప్లవానికి నాంది పలికినట్టవుతుంది.
