Tamil Nadu: తమిళనాడులోని సేలం జిల్లాలో గబ్బిలాల మాంసం విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఓమలూరు ప్రాంతంలో అటవీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు. వీరు అక్రమంగా గబ్బిలాలను వేటాడి, వాటి మాంసాన్ని వీధి వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
చిల్లీ చికెన్ పేరుతో మోసం:
అరెస్టయిన నిందితులు, వేటాడిన గబ్బిలాల మాంసాన్ని “చిల్లీ చికెన్” పేరుతో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో ఈ మాంసం సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసేలా ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది.
నిందితులు అటవీ ప్రాంతాల్లోకి చొరబడి నాటు తుపాకులతో గబ్బిలాలను వేటాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. గబ్బిలాలను వేటాడటం చట్టరీత్యా నేరం. వన్యప్రాణులను వేటాడటం, వాటి మాంసాన్ని విక్రయించడం భారత వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం.
అధికారులు ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అక్రమ గబ్బిలాల మాంసం సరఫరా నెట్‌వర్క్‌లో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రజలు వీధి ఆహారం కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తెలియని మాంసం ఉత్పత్తులను తీసుకోరాదని అధికారులు సూచిస్తున్నారు.