Narayanapeta: నారాయణపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మాగనూరు హైస్కూల్‌లో బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. అన్నం, పప్పు, గుడ్డు తిన్న తర్వాత సుమారు 110 మంది తీవ్ర ఇబ్బందిపడ్డారు. వెంటనే టీచర్లకు సమాచారం ఇవ్వడంతో వారు స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ డాక్టర్‌ను స్కూల్‌కు పిలిపించారు. 15 మంది స్టూడెంట్లకు ఫస్ట్ ఎయిడ్ చేసి, తొమ్మిది మందిని మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం మక్తల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఇందులో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన మరికొందరు స్టూడెంట్లు పలు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న డీఈవో అబ్దుల్ ఘనీ స్కూల్‌కు చేరుకొని విచారణ చేపట్టారు.మాగనూర్ స్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ స్కూల్ హెచ్ఎం మురళీధర్ రెడ్డి, ఇన్చార్జ్ హెచ్‌ఎం బాపురెడ్డిని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సస్పెండ్ చేసింది. అలాగే స్కూల్ మధ్యాహ్న భోజన ఏజెన్సీని కూడా రద్దు చేశారు. ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే తో ఫోన్లో మాట్లాడి బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

