Child Kidnap: సినిమా స్టైల్లో శిశువుని ప్లాన్ తో కిడ్నాప్ చేసారు గ్యాంగ్. ఈ ఘటనలో పక్కా ప్రొఫెషనల్లా వ్యవహరించారు నలుగురు మహిళా కిడ్నాపర్లు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అవ్వగా.. ప్రస్తుతం వైరల్ గా మారింది.
పుట్టిన నిమిషాల్లోనే శిశువు కిడ్నాప్ కు గురి కావటం సంచలనంగా మారింది. ఈ ఘటన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగు చూసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆడ శిశువు పుట్టిన నిమిషాల్లోనే కిడ్నాప్ కు గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దుదిగొండ గ్రామానికి చెందిన నజీమా, అబ్బాస్ అలీ దంపతులు. కాగా నజీమా కు పురిటి నొప్పులు రావడంతో కాన్పు కోసం మంగళవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమె బుధవారం తెల్లవారుజామున ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం కాసేపటికే పసికందు కనిపించకుండా పోయింది. ఈ విషయం గమనించిన శిశువు తల్లితండ్రులు, ఆసుపత్రి సిబ్బంది సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకొని అక్కడ సీసీ కెమెరాలను పరిశీలించారు. నజీమా సిజేరియన్ సమయంలో అక్కడ ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా తిరగడం గమనించారు. అయితే ఆ ముగ్గురు మహిళలపై శిశువు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. బృందాలుగా ఏర్పడి ఆ మహిళల కోసం గాలిస్తున్నారు.