Chicken Price Hike

Chicken Price Hike: మాంసం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్, మటన్ ధరలు.. కిలో ఎంతంటే?

Chicken Price Hike: తెలుగు రాష్ట్రాల్లోని మాంసం ప్రియులకు ఇది నిజంగా చేదు వార్తే. ఆదివారం వచ్చిందంటే చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగని పరిస్థితి ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ ముక్క కొనాలంటే సామాన్యులు ఆలోచించాల్సి వస్తోంది. రంజాన్ మాసం కావడంతో మాంసానికి డిమాండ్ పెరగడం, మరోవైపు ఎండల తీవ్రతకు కోళ్లు మరణిస్తుండటంతో ఉత్పత్తి తగ్గి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.

ధరల వివరాల్లోకి వెళితే, మొన్నటి వరకు కిలో రూ.330 వరకు ఉన్న స్కిన్‌లెస్ చికెన్ ధర ఇప్పుడు ఏకంగా రూ.400కు చేరుకుంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.350 పలుకుతుండగా, విజయవాడలో మాత్రం రూ.400 వరకు విక్రయిస్తున్నారు. ఇక లైవ్ బర్డ్ ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో డ్రెస్‌డ్ చికెన్ కిలో రూ.300గా ఉండగా, రిటైల్ మార్కెట్లో లైవ్ బర్డ్ ధర రూ.207 వరకు ఉంది. ఫామ్ దగ్గర విక్రయించే ధర కూడా రూ.180కి పెరిగింది.

చికెన్ మాత్రమే కాదు, మటన్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. సాధారణంగా కిలో రూ.800 ఉండే మటన్, రంజాన్ రద్దీ కారణంగా ఇప్పుడు రూ.1000 వరకు అమ్ముతున్నారు. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కోళ్ల పెంపకం తగ్గడమేనని వ్యాపారులు చెబుతున్నారు. వేసవి ఎండల వల్ల కోళ్లు ఎక్కువగా చనిపోతుండటంతో రైతులు పెంపకాన్ని తగ్గించారు. గతంలో లక్ష కోళ్లు పెంచే చోట ఇప్పుడు కేవలం 50 వేల కోళ్లను మాత్రమే పెంచుతున్నారు. దీనికి తోడు కోడిపిల్లల ధరలు, మేత ఖర్చులు కూడా పెరగడం ధరల పెరుగుదలకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *