Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌గఢ్‌లో కోల్‌మైనింగ్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాటం హింసాత్మక రూపం దాల్చింది. జిందాల్ కంపెనీ బొగ్గు ప్లాంట్‌లోనికి సమీపంలోని తమ్నార్ గ్రామస్థులు చొరబడి పోలీస్ వాహనాలను, ట్రాక్టర్లు ఇతర వాహనాలను తగులబెట్టారు. గ్రామస్థులను నిలువరించేందుకు యత్నించిన పోలీసులపై ఆందోళనకారులు తిరగబడ్డారు. వారిపై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో 10 మంది పోలీసులు సహా పలువురు గ్రామస్థులు గాయాలపాలయ్యారు.
Chhattisgarh: రాయ్‌గఢ్ జిల్లాలో గత కొంతకాలంగా ఈ బొగ్గుగనుల వివాదం కొనసాగుతూ వస్తున్నది. ఆ ప్రాంతంలో జిందాల్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (జేఎస్పీఎల్) చేపట్టిన కోల్ మైనింగ్ ప్రాజెక్టుకు నిరసనగా తమ్నార్ గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల తమ భూములు కోల్పోవడమే కాకుండా, ఆ ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటుందని, గ్రామస్థులు జీవనోపాధి ప్రశ్నార్థకమవుతుందని స్థానికులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు.
Chhattisgarh: గ్రామస్థుల ఆందోళన కార్యక్రమాల కారణంగా అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తాజాగా గ్రామస్థులు ఒక్కసారిగా జిందాల్ ప్లాంట్‌లోకి చొరవడటంతో పరిస్థితి అదుపు తప్పి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సమయంలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జికి దిగారు. ప్రతిగా గ్రామస్థులు పోలీసులపైకి రాళ్లతో దాడికి దిగారు. దీంతో 10 మంది పోలీసులకు, పలువురు గ్రామస్థులకు గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు మరిన్ని పోలీస్ బలగాలను రప్పించి, అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
