MLA Kale Yadayya: హైదరాబాద్–బీజాపూర్ హైవేపై మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో సంఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అతి వేగంగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 20 మందికి పైగా దుర్మరణం చెందారు.
ప్రమాదం జరిగిన చాలా సమయం తరువాత ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్యకు స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, మరమ్మతులు చేయాలని చాలాసార్లు విజ్ఞప్తి చేసినా ఎమ్మెల్యేతో సహా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదనే ఆగ్రహంతో వారు ఆందోళనకు దిగారు.
Also Read: Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం.. సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
స్థానికులు ఒక్కసారిగా ఎమ్మెల్యేను అడ్డుకుని, రోడ్డు మరమ్మతులపై ఆయనను నిలదీశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు స్థానికులు ఆవేశంతో ఎమ్మెల్యేపై దాడికి కూడా ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి స్థానికులను అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో ఎమ్మెల్యే కాలె యాదయ్యను పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు.
రోడ్డు ప్రమాదానికి కారణమైన రోడ్డు భద్రతా చర్యల లోపంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రోడ్డు మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రమాదానికి గురైన బస్సును తొలగించబోమంటూ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులతో వారికి వాగ్వాదం జరిగింది. ఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో పోలీసులు భారీగా మోహరించారు.

