చెన్నైలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో రౌండ్స్ చేస్తున్న 39 ఏళ్ల కార్డియాక్ సర్జన్ గుండెపోటుతో మృతి చెందాడు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాక్ సర్జన్ అయిన డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ (39), ఆసుపత్రిలో రోగులను పరీక్షిస్తున్న సమయంలో గుండెపోటుకు గురై మరణించారు. ఈ సంఘటన వైద్య వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ బుధవారం ఉదయం ఆసుపత్రిలో తన రోజువారీ రౌండ్స్ నిర్వహిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఛాతీ నొప్పికి గురయ్యారు. వెంటనే ఆయనను అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందించారు, కానీ ఆయన చికిత్సకు స్పందించకుండా కన్నుమూశారు. కేవలం 39 ఏళ్ల వయసులోనే ఒక కార్డియాక్ సర్జన్ గుండెపోటుతో మరణించడం చాలా ఆందోళన కలిగిస్తోంది.
డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ తన వృత్తిలో ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా పేరు పొందారు. ఈ సంఘటనపై వైద్యులు, స్నేహితులు , రోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం వైద్య రంగానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో యువకులలో పెరుగుతున్న గుండెపోటు కేసుల గురించి డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు జీవనశైలి మార్పులు, ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, ఆహారపు అలవాట్లు కావచ్చు.దీనిపై నిపుణులు మాట్లాడుతూ, ఎక్కువసేపు పని చేయడం వల్ల ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. వైద్యులు తరచుగా రోజుకు 12-18 గంటలు పని చేస్తారు, కొన్నిసార్లు ఒకే షిఫ్ట్‌లో 24 గంటలకు పైగా పని చేస్తారు. వారిపై తీవ్రమైన ఒత్తిడి కూడా ఉంది. మరికొందరిలో అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అనేక కారణాలు కూడా ఉండొచ్చని తెలిపారు.

