Chennai: నటుడు విజయ్‌కు సీబీఐ నోటీసులు

Chennai: తమిళనాడులో సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట దుర్ఘటన కేసులో టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

తొక్కిసలాట ఘటన నేపథ్యం

గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో విజయ్ నిర్వహించిన రాజకీయ ర్యాలీ సందర్భంగా భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

సుమారు 10 వేల మంది సామర్థ్యం ఉన్న సభాస్థలికి దాదాపు 30 వేల మంది తరలివచ్చిన కారణంగానే పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరిగిందని దర్యాప్తులో వెల్లడైంది.

భద్రతా లోపాలపై ఆరోపణలు

ఈ ఘటనలో సభ నిర్వహణలో భద్రతా మార్గదర్శకాలు ఉల్లంఘించారని,ర్యాలీకి హాజరైన వారికి సరైన ఆహారం, తాగునీటి వసతులు కల్పించలేదని,జన సమూహ నియంత్రణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని

విజయ్ బహిరంగ సభ నిర్వాహకులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కేసును దర్యాప్తు చేస్తోంది.

సీబీఐ విచారణ కీలకం

ఈ నేపథ్యంలో, కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు విజయ్‌ను నేరుగా విచారించాలని నిర్ణయించిన సీబీఐ, ఆయనకు అధికారిక నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో జరిగే విచారణలో ర్యాలీ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, అనుమతులు, నిర్వాహకుల పాత్రపై ప్రశ్నలు వేయనున్నట్లు సమాచారం.

ఈ నోటీసులు తమిళనాడు రాజకీయాల్లో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. టీవీకే పార్టీ భవిష్యత్ కార్యాచరణపై, అలాగే విజయ్ రాజకీయ ప్రయాణంపై ఈ కేసు ప్రభావం చూపే అవకాశముందన్న చర్చ సాగుతోంది.

సీబీఐ విచారణలో బయటపడే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *