Bangladesh: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో అరాచక శక్తుల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా ఆ దేశపు ప్రముఖ రాక్ స్టార్, గాయకుడు నగర్ బావుల్ జేమ్స్ సంగీత విభావరి (Concert) రణరంగంగా మారింది. ఒక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకపై గుర్తుతెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేయడంతో వేలాది మంది అభిమానులు భయాందోళనతో పరుగులు తీశారు.
అసలేం జరిగింది?
ఫరీద్‌పూర్‌లోని ఒక పురాతన పాఠశాల 185వ వార్షికోత్సవ ముగింపు వేడుకల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాత్రి 9:30 గంటలకు జేమ్స్ వేదికపైకి రావాల్సి ఉంది. అయితే, అప్పటికే అక్కడ మాటువేసిన ఒక వర్గం వ్యక్తులు, లోపలికి అనుమతించలేదనే సాకుతో ఒక్కసారిగా వేదికపైకి రాళ్లు విసిరారు.
అల్లరి మూకల దాడిని అక్కడున్న విద్యార్థులు ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.ఈ తొక్కిసలాట మరియు రాళ్ల దాడిలో సుమారు 15 నుంచి 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు రాత్రి 10 గంటలకు షోను రద్దు చేశారు. గాయకుడు జేమ్స్ క్షేమంగా బయటపడ్డారు.
సాంస్కృతిక విద్రోహం: తస్లీమా నస్రీన్ ఆవేదన
ఈ ఘటనపై ప్రవాస రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. బంగ్లాదేశ్‌లో ఇస్లామిస్ట్ మూకలు కళలను, సంగీతాన్ని అణచివేస్తున్నాయని ఆమె ఆరోపించారు. “కళాకారులకు రక్షణ లేని దేశానికి విదేశీ ప్రతిభావంతులు ఎందుకు వస్తారు?” అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. ఇది కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, బంగ్లాదేశ్ సంస్కృతిని నాశనం చేసే కుట్ర అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
యూనస్ ప్రభుత్వంపై పెరుగుతున్న విమర్శలు
మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అరాచక మూకలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జర్నలిస్టులు, కళాకారులు మరియు మైనారిటీ సంస్థలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.
ఎన్నికలను వాయిదా వేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి అల్లర్లను ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంగీత కచేరీలను కూడా నిర్వహించుకోలేని స్థితిలో దేశం ఉందంటే, అక్కడ ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఢాకా నుంచి 120 కిలోమీటర్ల దూరంలోని ఫరీద్‌పూర్‌లో జరిగిన ఈ దాడి, బంగ్లాదేశ్‌లో నెలకొన్న అస్థిరతకు నిదర్శనం. ఒకప్పుడు సంగీతానికి, కళలకు పెట్టింది పేరైన బంగ్లా, ఇప్పుడు ఛాందసవాద శక్తుల చేతుల్లో బందీ అవుతోందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
