Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విధానాన్ని మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రతినిధి బృందంతో నిర్వహించిన సమీక్షలో “డీ-రెగ్యులేషన్ ఫేజ్-2” విధానంపై సీఎం చర్చించారు. పరిశ్రమల ఏర్పాటులో ఎదురయ్యే అనవసరమైన అడ్డంకులను తొలగించి, పారిశ్రామికవేత్తలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం పరిశ్రమల అనుమతుల కోసం ఉన్న 800కు పైగా నిబంధనలను భారీగా తగ్గించి, కేవలం 100 లోపుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే లైసెన్సులు, పర్మిషన్ల సంఖ్యను కూడా కనిష్ట స్థాయికి తగ్గించాలని సూచించారు. అయితే, నిబంధనలు సరళీకరించినప్పటికీ.. ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులకు గట్టిగా చెప్పారు. అనవసర తనిఖీలతో ఇబ్బంది పెట్టకుండా, పారదర్శకత కోసం థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
పరిశ్రమల అనుమతుల కోసం పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా మార్పులు చేయాలని సూచించారు. మే నెలాఖరులోగా ఈ కొత్త విధానాలను (ఫేజ్-2) అమల్లోకి తీసుకురావాలని, దీనివల్ల అనుమతుల ప్రక్రియలో కనీసం 40 శాతం సమయం ఆదా అవుతుందని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అటవీ చట్టాలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలను కూడా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మార్చుకోనున్నారు.
రాష్ట్రంలో కేవలం వ్యాపారం చేయడమే కాకుండా, అది ఎంత వేగంగా జరుగుతుందనేదే ముఖ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” స్థానంలో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అనే కొత్త నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రాబోయే రోజుల్లో జూన్ నుంచి ప్రారంభమయ్యే ఫేజ్-3లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అధునాతన సాంకేతికతను వాడాలని సీఎం సూచించారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్, రియల్ టైమ్ డేటా వంటి వ్యవస్థలతో ఏపీ ప్రభుత్వం పాలనలో వేగం పెంచిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
