Chandrababu New House: చిత్తూరు జిల్లా కుప్పం ఇప్పుడు వేడుకల మయంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత ఇంటిలో ఈ రోజు (ఆదివారం) గృహప్రవేశం ఘనంగా జరగనుంది. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురం గ్రామంలో రెండెకరాల స్థలంలో నిర్మించిన ఈ నూతన గృహంలో ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
భువనేశ్వరి పర్యవేక్షణలో ఏర్పాట్లు
గత వారం రోజులుగా నిర్వహణ బృందం అన్ని ఏర్పాట్లను సమర్థంగా చేపట్టింది. ప్రత్యేకంగా సీఎం సతీమణి నారా భువనేశ్వరి గారు స్వయంగా కుప్పానికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యంగా వాస్తు హనవం, సత్యనారాయణ స్వామి వ్రతం వంటి శాస్త్రోక్త పూజలు నిర్వహించడానికి పండితులు సిద్ధమయ్యారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో పవిత్ర గృహ ప్రవేశం
గత రాత్రి మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ కుప్పానికి చేరగా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ సమావేశం ముగించుకొని అర్ధరాత్రి తర్వాత కుప్పం చేరుకున్నారు. ఇది కేవలం కుటుంబ వేడుకగా నిర్వహించబడుతున్నప్పటికీ, నియోజకవర్గ ప్రజల కోసం భోజన ఏర్పాట్లు ప్రత్యేకంగా చేశారు.
ముప్పై వేలమందికి విందు భోజనం
ఈ కార్యక్రమానికి హాజరయ్యే దాదాపు 30,000 మంది అతిథుల కోసం వంటకాలు, సాంప్రదాయ భోజనాలు సిద్ధం చేశారు. ప్రత్యేకమైన మెనూ, అతిథుల సౌకర్యార్థం షెడ్లు, పార్కింగ్, వసతి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. కుప్పం పట్టణం అంతటా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వేడుకను పండుగలా మార్చారు.
ప్రజల్లో ఉత్సాహం, గర్వభావం
1989 నుంచి ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాయుడు గారు, తొలిసారి తన సొంత నియోజకవర్గంలో స్వంత ఇల్లు నిర్మించుకున్న సందర్భం ఇది. దీన్ని ప్రజలు ఎంతో గర్వంగా, ఆనందంగా స్వాగతిస్తున్నారు. ఇది కేవలం ఒక గృహ ప్రవేశ వేడుక మాత్రమే కాదు… కుప్పం ప్రజల విజయోత్సవం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.