Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సాధారణంగా చాలా శాంతంగా, శ్రద్ధగా వ్యవహరిస్తారు. ఏ సమస్య వచ్చినా తన అనుభవంతో చక్కదిద్దేస్తారు. కానీ ఈసారి పార్టీ నేతల మీద మాత్రం కాస్త గట్టిగానే స్పందించారు.
ఆదివారం మంగళగిరిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సమావేశంలో వచ్చే ఎన్నికల పనితీరుపై చర్చ జరిగింది.
అయితే ఆశించిన విధంగా అందరూ హాజరుకాలేదు. దాదాపు 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాలేదు. దీనిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండే వాళ్లకు భవిష్యత్తు లేదు” అని స్పష్టంగా హెచ్చరించారు.
ఎవరెవరు వచ్చారు, మధ్యలో వెళ్లిపోయారు, చివరవరకూ ఉన్నారన్న సమాచారం తన వద్ద ఉందని కూడా చెప్పారు.
“విదేశాల్లో ఉన్నామని చెబుతున్నారు, కొంతమంది ఆలయాలకు వెళ్లామని చెబుతున్నారు.. కానీ పార్టీ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం అస్సలు బాగోదు” అని అన్నారు చంద్రబాబు.
ఇది కూడా చదవండి: ORR Accident: ఒకదానికొకటి ఢీకొన్న 9 కార్లు.. సడెన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం
తరచూ అమెరికా, కెనడా వంటి దేశాల్లో ‘ఆటా’, ‘తానా’ కార్యక్రమాలకు వెళ్లే ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా వార్నింగ్ ఇచ్చారు.
“అటూ ఆటా తానా తిరిగే వాళ్లు.. ఇక అక్కడే ఉండాలి. అంతగా విదేశాలంటే అక్కడే ఉండండి” అని హెచ్చరించారు.
అంతేకాదు, పెన్షన్ పంపిణీ జరుగుతుంటే కొంతమంది ఎమ్మెల్యేలు పక్కన కూడా ఉండరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతో కలిసి ఉండాలి, వారి సమస్యలు వినాలి, ప్రజల్లో ఉండే నాయకులు మాత్రమే నిలబడతారని స్పష్టం చేశారు.