Chandrababu

Chandrababu: ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే తాట తీస్తా..

Chandrababu: విజయవాడలో ఘనంగా ప్రారంభమైన ‘స్త్రీ శక్తి’ పథకంతో ఆంధ్రప్రదేశ్ మహిళలకు స్వేచ్ఛా ప్రయాణం, ఆర్థిక స్వావలంబన దిశగా మరో అడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ RTC బస్సులో ప్రయాణించి పథకాన్ని ప్రజలకు అంకితం చేశారు. మొదటి లబ్ధిదారులుగా ఉమ, కృష్ణవేణిలను సత్కరించారు.

“ఆడ బిడ్డలకు మహర్దశ వచ్చే వరకు అండగా ఉంటాం. 2.02 కోట్ల మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం మా లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047లో ఆనందం, ఆరోగ్యం, ఆదాయం సమృద్ధిగా ఉండాలి” అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆగష్టు 15న ప్రారంభించడం వెనుక మహిళా స్వాతంత్ర్యం పట్ల ఉన్న గౌరవమేనని ఆయన పేర్కొన్నారు.

మహిళల భద్రత – కఠిన హెచ్చరిక

రాష్ట్రంలో ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే తగిన శిక్ష తప్పదని సీఎం హెచ్చరించారు. “నేను, పవన్ గారు కూడా క్యారెక్టర్ అసాసినేషన్‌కి బలయ్యాం. ఇకపై ఆడబిడ్డల గౌరవానికి విరుద్ధంగా వ్యవహరిస్తే వదిలేది లేదు” అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.

సామాజిక సంక్షేమం – పెన్షన్ల నుండి ఉద్యోగాల వరకు

ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని, దీపం 2 పథకం ప్రారంభించామని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ నెలాఖరులోగా మెగా DSC ద్వారా 16,347 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Free Bus Scheme: తెలుగు రాష్టాల్లో ఉచిత బస్సు.. ఈ తేడాలు గమనించారా?

మహిళలకు జీరో టికెట్ ప్రయాణం

స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్రంలోని అన్ని మహిళలకు జీరో ఫేర్ టికెట్ సౌకర్యం కల్పించారు. ఉద్యోగం, వ్యాపారం, మార్కెట్, ఆసుపత్రి—ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ప్రయాణించవచ్చు. బస్సులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంచి, రియల్‌టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.

మహిళలు డ్రైవర్లుగా – ఎలక్ట్రిక్ బస్సుల యుగం

ప్రస్తుతం కండక్టర్లుగా ఉన్న మహిళలు త్వరలో డ్రైవర్లుగా కూడా చేరతారని చెప్పారు. ఎలక్ట్రిక్ AC బస్సులు మాత్రమే కొనుగోలు చేసి, భవిష్యత్తులో ఆటోమేటిక్ డ్రైవింగ్ సదుపాయం తీసుకురానున్నట్లు వెల్లడించారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు MSME రంగంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

కేంద్రం సహకారం – అభివృద్ధి ప్రాజెక్టులు

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే త్రాగునీటి సమస్యలు తీరుతాయని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 12 వేల కోట్లు, సెమీకండక్టర్ పరిశ్రమ కేంద్రం ఇచ్చిందని చెప్పారు. అమరావతి పనులు పునరుద్ధరించబడ్డాయని, కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతోందని పేర్కొన్నారు.

పులివెందులలో ‘స్వతంత్రం’

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో 30 ఏళ్ల తరువాత ప్రజలకు ఓటు వేసే అవకాశం లభించిందని, దాన్ని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. ఇకపై రిగ్గింగ్‌కి తావులేదని తేల్చి చెప్పారు.

‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు ప్రయాణ స్వేచ్ఛ మాత్రమే కాకుండా, ఆర్థిక, సామాజిక, భద్రతా హక్కుల రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *