Chandrababu Naidu: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండల పరిధిలో జరిగిన మీర్జాగూడ బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మరణించడం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
24కు చేరిన మృతుల సంఖ్య; ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
ఈ హృదయ విదారకమైన చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 24కు చేరింది. ఈ దుర్ఘటనలో దాదాపు 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో సుమారు 20 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే, అధికారులు చనిపోయిన 24 మందిని గుర్తించారు. ప్రస్తుతం, చేవెళ్ల ఆస్పత్రిలో మరో 10 మందికి చికిత్స అందిస్తున్నారు. అయితే, పరిస్థితి విషమంగా ఉన్న వారిని నిమ్స్ (NIMS) మరియు గాంధీ ఆస్పత్రులకు తరలించారు. ఈ మృతులలో తాండూరు పట్టణంలోని వడ్డెర గల్లీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు – తనుషా, సాయి ప్రియ, నందిని – చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

