Chandrababu Naidu: ఆ పరమశివుని ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి. మహాశివ రాత్రి పర్వదినంలో మహా గ్రూప్ ఆధ్వర్యంలో మహా భక్తి చానల్ ప్రారంభం కావడం సంతోషాన్ని కలిగిస్తోంది. రంజని అఖాడా మహామండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి జీ మహరాజ్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మహా టీవీ వంశీని, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లా నంబూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరిగిన మహాటీవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహా భక్తి చానల్ ను ప్రారంభించారు. మహా రుద్రాభిషేకంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… పవిత్ర కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. కైలాసానంద గిరి జీ మహారాజ్ గారితో ఉంటే ఎంతో శక్తి వస్తోంది. దీక్షతో ఆయన కుంభమేళా ఘనంగా నిర్వహించారు. ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్ గా పనిచేసిన వంశీ మహాటీవీని నడిపించడం గొప్ప విషయం. మహాభక్తి చానల్ ఏర్పాటుతో వంశీ చరిత్ర సృష్టించాడు. చిన్న చిన్న వ్యక్తులు కూడా అసాధారణమైన శక్తులుగా తయారవుతారు అనడానికి వంశీ ఉదాహరణ. వంశీ నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వ్యక్తి. వంశీ ఎవరికీ భయపడడు. మహా భక్తి చానల్ ద్వారా ఓవైపు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకువస్తూ మరోవైపు విలువలు కాపాడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
భగవంతుని ధ్యానిస్తే ఒత్తిడి మాయం
Chandrababu Naidu: నేడు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అందరిలో టెన్షన్ ఎక్కువవుతోంది. దేవునిపై భారం వేసినప్పుడు ధైర్యం వస్తుంది. ఒకప్పుడు చిన్న ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లేవాళ్లం. కానీ నేడు ఏఐ సాయంతో మెరుగైన సేవలు పొందుతున్నాం. మనశ్శాంతికి మాత్రం ఎటువంటి మందు లేదు. ఇందుకు దేవుని ఆరాధనే పరిష్కారం.
పేదరికం లేని సమాజమే నా లక్ష్యం
Chandrababu Naidu: ఎన్డీఏ ప్రభుత్వం దేవాలయాలపై దృష్టి పెట్టింది. ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మన పిల్లలకు ఆధునిక పరిజ్ఞానం ముఖ్యమే. అవన్నీ సంపద సృష్టికి పనికివస్తాయి. దాంతోపాటు ఆధ్మాత్మిక చింతన కూడా అవసరం . కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం. మోదీ, పవన్, నాపై నమ్మకంతొ ప్రజలు అఖండ విజయం అందించారు. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం. పేదరికం లేని సమాజం నా లక్ష్యం. మన రాష్ట్రం , మన దేశం సుభిక్షంగా, సుసంపన్నంగా ఉండాలని ఆ పరమశివుని కోరుకున్నట్టు సీఎం చంద్రబాబు అన్నారు.

