RRR: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగాల సంకలనంగా రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు దూరదృష్టి అనేది ఎంతటి రాజకీయ ప్రత్యర్థులు అయినా గౌరవించక తప్పదన్నారు. భవిష్యత్తును ముందుగానే ఊహించి కార్యాచరణ రూపొందించే ఆయన శైలి, నిజమైన ‘టైమ్ ట్రావెలర్’లాగా ఉందని అభివర్ణించారు.
మహాత్మా గాంధీ ఓర్పు, సుభాష్ చంద్రబోస్ విప్లవోపేతత – ఈ రెండూ చంద్రబాబులో సమపాళ్లలో దర్శనమిస్తాయన్నారు. అవసరమైనప్పుడు విప్లవ ధోరణి చూపగల శక్తి ఆయనలో ఉందని, అయితే మామూలుగా ఓర్పు, శాంతమే ఆయన ప్రాతినిధ్యం వహించే లక్షణాలనన్నారు. విదేశాల్లో ఉన్నా రాష్ట్ర పరిపాలనపై వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పర్యవేక్షణ చేస్తారని, ఆయన పనితీరు ఎప్పటికప్పుడు అపూర్వమైందన్నారు.
చంద్రబాబుతో కలిసి పనిచేసే అవకాశం ఆలస్యంగా వచ్చినా, అది తనకు లభించడంపై గర్వంగా ఉందని తెలిపారు. విజనరీ నాయకుడిగా ఆయన అందరికీ ఆదర్శమని, ఆయన తత్వాన్ని అర్థం చేసుకున్న వారెవ్వరైనా విజయవంతంగా ఎదగగలరని పేర్కొన్నారు.
చంద్రబాబు సమయపాలనపై తొలుత తనకు చిన్న సందేహం వచ్చినా, తర్వాత ఆయన సమయాన్ని ఎందుకు మించి ఖర్చుపెడతారో అర్థమైందని రఘురామ తెలిపారు. చిన్నవారి అభిప్రాయాలను కూడా గౌరవంగా వినే ఆయన, నిజమైన నిత్య విద్యార్థి అని కొనియాడారు. అలాంటి నాయకుడి వల్ల కొంతమందికి తాత్కాలికంగా ఇబ్బంది అయినా, రాష్ట్రానికి దీర్ఘకాల ప్రయోజనం జరుగుతుందన్నారు.
చివరిగా, చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆశయాలు సాకారమవాలని ఆకాంక్షించారు.