Chandrababu Naidu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తాజా మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులందరూ కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి కష్టాలను త్వరగా తీర్చేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల మన రాష్ట్రంపై పడే ప్రభావంపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. యుద్ధ ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి భద్రత గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, గ్యాస్ సరఫరాను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం తెలిపారు.
అదేవిధంగా, ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు ప్రత్యేక నిఘా పెట్టాలని కోరారు. ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త ప్రణాళికలను వచ్చే నెలలో పూర్తి వివరాలతో వెల్లడిస్తామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.
