Chandrababu: ఏపీకి పోలవరం గేమ్ చేంజర్ గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. గేమ్ చేంజర్‌గా మారుతుందని ప్రకటించారు.2027 జూలై నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో కరువును నివారించవచ్చని చెప్పారు. హైబ్రిడ్ విధానంలో కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి అనకాపల్లికి గోదావరి జలాలను తరలిస్తామని తెలిపారు. అక్కడి నుంచి విజయనగరం జిల్లాలోని నదులను అనుసంధానం చేసుకుంటూ.. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధారలను కలుపుతూ.. బాహుదా నది దాకా తీసుకెళ్తామన్నారు.
వంశధారలో వరద ఉంటే.. నీరు విశాఖ వైపు వస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో రివర్స్ పంపింగ్ విధానం ద్వారా శ్రీకాకుళం జిల్లా సరిహద్దు దాకా గోదావరి జలాలను తరలిస్తామన్నారు. నదుల అనుసంధానంపై వినూత్న ఆలోచన చేస్తున్నామన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద రిజర్వాయరు నిర్మించి.. పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను తరలించి 150 టీఎంసీలను నిల్వ చేస్తామని చెప్పారు. అక్కడ నుంచి బనకచర్లకు తీసుకెళ్లి పెన్నా నదికి అనుసంధానించే కార్యక్రమం చేపడతామన్నారు. ఇందుకోసం రూ.72 వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు.ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించడం కష్టమేనన్నారు. దీనిపై కేంద్రంతో కూడా మాట్లాడతామని చెప్పారు. 4 ‘పీ’(పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్‌షిప్) విధానంలో నిధులు సమీకరించడంపై దృష్టిపెడతామన్నారు.
పోలవరం పూర్తి చేస్తే 200 టీఎంసీలను సీమకు వాడుకోవచ్చు. ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేస్తాం. ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తాం. 2019-24 మధ్య జగన్ పాలన పోలవరం ప్రాజెక్టు పాలిట విధ్వంసకరం. జగన్ రివర్స్ టెండర్ పేరిట విధ్వంసానికి దిగాడు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం, కేంద్ర జలశక్తి శాఖ వద్దన్నా వినలేదు. అప్పటి వరకూ వేగవంతంగా పనులు చేస్తున్న నిర్మాణ సంస్థను తరిమేశారు. దీనివల్ల 2020దాకా ప్రాజెక్టు ప్రాంతంలో పనులు చేపట్టేవారే లేకుండా పోయారు. పర్యవేక్షణా కొరవడింది. ఫలితంగా 2020లో వచ్చిన భారీ వరదకు డయాఫ్రం వాల్ దెబ్బతింది. భూమిలోపల ఉండే ఈ వాల్ వరదకు దెబ్బతిన్నదో లేదో కూడా జగన్ సర్కారు గ్రహించలేదు. 2019లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే.. 2021 నాటికే పోలవరం పూర్తయ్యేది.
రోడ్లపై మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రహదారుల నిర్వహణపై తన వద్ద వినూత్నమైన ఆలోచన ఉందని అన్నారు. జాతీయ రహదారుల మాదిరిగా గ్రామాల్లోనూ రోడ్ల నిర్మాణంపై దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రహదారుల నిర్వహణకు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రతిపాదన చంద్రబాబు చేశారు. రహదారుల నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించే ఆలోచన చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు.. ఉభయగోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ విధానాన్ని ప్రజలు స్వాగతిస్తే.. రాష్ట్రవ్యా్ప్తంగా అమల్లోకి తెస్తామని చంద్రబాబు చెప్పారు.