Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ , పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్ది గంటల్లో అంటే ఈరోజు (ఫిబ్రవరి 23, 2025) మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనుంది . రెండు జట్ల మధ్య మ్యాచ్ దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌ను ఓడించడం ద్వారా భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను విజయవంతంగా ప్రారంభించింది. ఇదిలా ఉండగా, ఆతిథ్య పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. అయితే, ఇప్పటివరకు భారతదేశం – పాకిస్తాన్ ఎన్ని మ్యాచ్‌లలో తలపడ్డాయి? రెండు జట్లు ఏ 11 మంది ఆటగాళ్లతో ఆడవచ్చో ఆ వివరాలను చెక్ చేద్దాం.
ముఖాముఖి ఇలా..
Champions Trophy 2025: భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లను ఒకసారి పరిశిలిస్తే భారత్ కు నిరాశే కలుగుతుంది . ఇటు వన్డేల్లోనూ అటు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల్లోనూ పాకిస్తాన్ పైచేయి స్పష్టంగా కనిపిస్తోంది . మరి ఈసారి ట్రోఫీలో పాక్ జట్టును ఓడించి టీమిండియా ఆధిపత్యాన్ని చాటుతుందా చూడాల్సి ఉంది . ఇక గత మ్యాచ్ ల విషయానికి వస్తే భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు మొత్తం 135 వన్డేలు జరిగాయి. పాకిస్తాన్ అత్యధిక మ్యాచ్‌లను (73) గెలుచుకోగా, భారతదేశం (57) గెలిచింది. 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. భారత్ – పాకిస్తాన్ తమ మ్యాచ్‌లలో ఎక్కువ భాగం తటస్థ వేదికలలో ఆడాయి. ఇక్కడ పాకిస్తాన్ 40 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, భారత్ 34 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇందులో కూడా పాకిస్తాన్ ముందంజలో ఉంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత జట్టు పాకిస్థాన్‌తో 2 వన్డేలు ఆడింది. ఈ రెండు సార్లు భారత జట్టు గెలిచింది. ఇప్పుడు ఈ స్టేడియంలో పాకిస్థాన్‌పై హ్యాట్రిక్ విజయాలు సాధించే అవకాశం భారత్‌కు ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు జట్ల ఆటతీరు ఎలా ఉందంటే..
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య మొత్తం 5 మ్యాచ్‌లు జరిగాయి. పాకిస్తాన్ భారత్‌ను 3 మ్యాచ్‌ల్లో ఓడించింది. భారతదేశం కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు చివరిసారిగా తలపడ్డాయి 2017లో. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో, లండన్‌లోని ది ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ భారత్‌ను ఓడించి టోర్నమెంట్‌ను గెలుచుకుంది.
భారత జట్టు అంచనా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా/అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి
పాకిస్తాన్ జట్టు అంచనా:
ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, సల్మాన్ ఆఘా, తయ్యిప్ తాహిర్, కుష్తీల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్