Chamala Kiran: ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారని భావిస్తూ పగటి కలలు కంటూ కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలు నాటకాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, 200 మంది చెంచాలను వెంటబెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చామల.. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి ఏడాదిన్నరే అయ్యిందన్నారు. కానీ అప్పటినుంచి ప్రజల మనసుల్లో విషబీజాలు నాటే ప్రయత్నాలు ఆ పార్టీ నేతలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దుష్ప్రచారం చేసేందుకు కేసీఆర్ కుటుంబం అనేక ప్రయత్నాలు చేస్తున్నా.. అవన్నీ విఫలమవుతున్నాయని వ్యాఖ్యానించారు.
“పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏం చేశాడు?” అనే ప్రశ్నను చామల సంధించారు. “కాంగ్రెస్ పాలనలో ఏమీ జరగడం లేదని విమర్శించే ముందు, తమ పాలనలో నెరవేర్చని వాగ్దానాల గురించి బీఆర్ఎస్ నేతలు చర్చించాలి,” అని పేర్కొన్నారు. 2014, 2018 మేనిఫెస్టోల్లోని 70కి పైగా హామీలు నెరవేర్చలేదని, కానీ ప్రస్తుతం గ్రామాల్లో వెళ్లినా సంక్షేమ పథకాలు ప్రజల దృష్టిలో ఉంటున్నాయని అన్నారు.
కుటుంబ సభ్యుల ఫోన్ల ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పాత్రే ఉన్నదని ఆయన ఆరోపించారు. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్‌లోకి వెళ్లిన పాడి కౌశిక్ రెడ్డి గురించి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఓట్లేయకపోతే నేను చస్తానని బెదిరించి ఓట్లు వేయించుకున్న దరిద్రుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి ఫేమస్ కావాలని చూస్తున్నాడు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
చివరగా, “రేవంత్ రెడ్డిని తిట్టి బీఆర్ఎస్ నేతలు ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు. ప్రజలు ఇప్పుడు మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరు” అని స్పష్టం చేశారు.